TDP central office : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. లొంగిపోయిన ప్రధాన నిందితుడు

TDP central office
TDP central office attack case : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సోమవారం కీలక మలుపుతిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పానుగంటి చైతన్య మంగళగిరిలోని కోర్టు ఎదుట లొంగిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన చైతన్య ఈరోజు కోర్టు ఎదుట లొంగిపోయారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును కోరారు. అయితే ఇన్ని రోజుల తర్వాత కేసులో కీలకంగా ఉన్న పానుగంటి చైతన్య బయటకు రావడంతో టీడీపీ ఆఫీసుపై దాడి కేసు కీలక మలుపు తిరిగింది.
మరోవైపు టీడీపీ ఆఫీసుపై దాడి కేసును ఏపీ ప్రభుత్వం ఇటీవలే సీఐడీకి అప్పగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సాంకేతిక కారణాల నేపథ్యంలో ఇప్పటికి ఇంకా మంగళగిరి పోలీసులే దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం ఆరోపణలు ఎదర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా మంగళగిరి పోలీసుల ఎదుట వారు విచారణకు హాజరయ్యారు.