యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ : అబుదాబి , అజ్మాన్ , దుబాయ్ , ఫుజైరా , రస్ అల్ ఖైమా , షార్జా మరియు ఉమ్ అల్ క్వైన్ అనే ఏడు ఎమిరేట్ల (దేశాల) సమాఖ్య, ప్రతి ఎమిరేట్ కూ ఒక పాలకుడుంటాడు. ఇస్లాంమత రాచరికపు వ్యవస్థ. వీళ్ళందరూ ఏక కంఠంతో ఆమోదించి ప్రోత్సహించగా BAPS స్వామినారాయణ్ సంస్థ చే నిర్మించబడుతున్న ఈ హిందూ ఆలయం దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేకి దూరంగా అల్ రహ్బాకు సమీపంలో ఉన్న అబు మురీఖా వద్ద ఉంది.
ముస్లిం పాలకుడు సమర్పించుకున్న భూమి, క్యాథలిక్ క్రిస్టియన్ రూపొందించిన ప్రాజెక్ట్. ప్రముఖ్ స్వామి ప్రేరణతో మరియు మహంత్ స్వామి మహారాజ్ ఆశీర్వాదంతో ఈ మందిరం, అరబ్ దేశాల యొక్క సామాజిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లబోతున్నది, UAE పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్యంలో నిర్మాణమైన మొదటి హిందూ మందిరమిది.
ఇటాలియన్ తెల్లని చలువరాళ్ళు రాజస్థాన్ నుండి గులాబీ రంగు ఇసుకరాళ్లు సేకరించారు, ఈ రాళ్ళు గుజరాత్, రాజస్థాన్ మరియు ఒరిస్సాలోని వివిధ ప్రాంతాల్లోని శిల్పకళా నైపుణ్యం కలిగిన వారసత్వ కళాకారులచే అతి సున్నితంగా, సూక్ష్మంగా శిల్పాలుగా రూపొందించబడ్డాయి.
ఆగష్టు 2015లో, UAE ప్రభుత్వం అబుదాబిలో మందిరాన్ని నిర్మించడానికి భూమిని అందించాలనే నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ మొదటి అధికారిక పర్యటన సందర్భంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
జనవరి 29, 2024న 42 దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు ఆలయాన్ని సందర్శించారు, యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ఈ పర్యటనను నిర్వహించారు.
సరిగ్గా ఐదు సంవత్సరాల తరువాత నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆలయం ఫిబ్రవరి 14, 2024న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. ఆలయ ప్రారంభానికి ఒక రోజు ముందు, అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారతీయులు ఉద్దేశిస్తూ ఫిబ్రవరి 13న ‘అహ్లాన్ మోడీ’ గా ఏర్పాటు చేసిన ఒక భారీ సభలో ప్రసంగిస్తారు.
ఆలయ ప్రత్యేకతలు – విశేషాలు:
* గతంలో అనేక ఆలయాలు విధ్వంసం చేసిన వారి ఇప్పటితరం ఈ నిర్మాణానికి పూనుకోవడం ఒక విశేషం.
* అక్కడ 6శాతం ఉన్న హిందువులు మాత్రమే కాకుండా హిందూ జీవన శైలిని పోలిన వాటిని అనుసరించేవారు, ఆయుర్వేదం, శాకాహార సాత్వికాహారం తీసుకునేవారు, యోగాసనాలు ప్రాణాయామం వంటి అష్టాంగయోగను ఇష్టపడేవారు, భజనలు కీర్తనలు యజ్ఞము వంటి వాటిని నిర్వహిస్తూ ఆనందించేవారు, ప్రకృతి ఆరాధకులందరికీ ఈ ఆలయం కేంద్రం కాబోతున్నది.
* యూఏఈ లోని 7 ఏమిరేట్స్ ని ఆలయ ఏడు శిఖరాలు సూచిస్తాయి.
* మొత్తం 27 ఎకరాల్లో ఆలయం నిర్మితమైంది.
* యూఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని తెప్పించి ఆలయ నిర్మాణంలో వాడారు.