Telangana Polling Day : తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తం అవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు. ఓటు వేయడం కనీస బాధ్యతగా భావించి ఓటు వేయడానికి వస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు క్యూ లైన్లో నిలబడి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాజకీయ నాయకుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తమ ఓటు వేశారు.
ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తన సతీమణి లక్ష్మీప్రణతితో కలిసి వచ్చారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో సుమంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మాదాపూర్ లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల పోలింగ్ బూత్ లో హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఓటు వేశారు. రాష్ట్రంలో ఓటర్లు ముమ్మరంగా తమ హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచి పోలింగ్ మందకొడిగానే ప్రారంభమైంది. మెల్లమెల్లగా ఓటర్లు ఓటు వేసేందుకు వస్తున్నారు. నగర ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రొనాల్డ్ రోస్ కోరారు.