Prajakavi Andesri: ప్రజాకవి అందెశ్రీ కి తెలంగాణ ప్రభుత్వం గొప్ప గౌరవం కల్పించింది.

జయ జయహే తెలంగాణకు వందనం

గేయ రచయిత,ప్రజాకవి అందెశ్రీ కి తెలంగాణ ప్రభుత్వం గొప్ప  గౌరవం కల్పించింది. ఆయన రచించిన జయ జయహే తెలం గాణ జనని జయకేతనం గీతాన్ని తెలంగాణ రాష్ట్ర మాతృ గీతంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిజంగా ఇదొక గొప్ప నిర్ణయం! కవి అందెశ్రీ కి ఇచ్చిన మహా గౌరవం! సినారే ఉంటే ఆయనతో ప్రత్యేకంగా రాయించే వారు!

కానీ, తెలంగాణ ఉద్యమం సమయం లో అందెశ్రీ రాసిన ఈ గీతానికి జనం జేజేలు పలికారు. కెసిఆర్ సైతం ఈ గేయాన్ని రాష్ట్ర గీతం గా గుర్తిస్తామని ప్రకటించి ఎందుకో మళ్ళీ మడమ తిప్పారు! కానీ, మంత్రివర్గం లో పెట్టి జీవో రూపం లో తీసుకు రాలేకపోయారు! రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోకి వస్తూనే తొలి అసెంబ్లీ లో అందెశ్రీ కవిత ను ఉదహరించారు. ఆయన రాసిన గీతానికి ఇవాళ రాష్ట్ర గీతంగా రాజముద్ర వేశారు. ఇక ప్రతి అధికారిక కార్యక్రమాల్లో తోలుత అందెశ్రీ గీతం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపిస్తారు. ముగింపు లో జాతీయ గీతం జనగణమన ఆలపిస్తారు.

అందెశ్రీ పేరు ఇక తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయం! అందెశ్రీ ప్రకృతి కవి! జనగాం జిల్లా రేబర్తి కుగ్రామంలో 1961 జూలై 18న జన్మించారు. ఆయన వయసు 62 సంవత్సరాలు! అసలు పేరు అందె ఎల్లయ్య! అనాధ గా గొడ్ల కాపరిగా పెరిగారు. చదువు లేదు కానీ కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. శృంగేరి పీఠం శంకర్ మహారాజ్ చేరదీశారు.

ఆర్. నారాయణ మూర్తి సినిమాల్లో పాటలు రాశారు. 2006లో అతను గంగ సినిమాకు అందించిన సంభాషణలకు నంది పురస్కారం లభించింది. బతుకమ్మ సినిమాకు మాటలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆశువుగా కవిత్వం చెప్పడం లో అందెశ్రీ అందె వేసిన కలం!

నదులను సాహిత్యం ద్వారా అనుసంధానం చేయాలని ప్రపంచం లోని ప్రధాన నదులన్నీ పర్యటించి పరిశోధన చేసి పుస్తకం రూపంలో వెలుగులోకి తెచ్చారు. మాయమై పోతున్నాడమ్మా మనిషన్న వాడు ఆయన రాసిన పాటల్లో ఓక సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వ విద్యాలయాల్లో తెలుగు పాఠ్యంశం గా ప్రవేశ పెట్టి గౌరవించింది.

పల్లె నీకు వందనాలమ్మ,గలగల గజ్జెల బండి,కోమ్మ చెక్కితే బోమ్మరా లాంటి పాటలు జనాదరణ పోందాయి. వంశీ సాహిత్య పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, సుద్దాల హనుమంతు జాతీయ పురస్కారం లభించాయి. మిత్రుడు ఆందెశ్రీకి శుభాకాంక్షలు. అద్భుత నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి కి అభినందనలు.

– డా. మహ్మద్ రఫీ

TAGS