TDP-Janasena-BJP Alliance : ‘కూటమి’ సూపర్ హిట్ కొట్టబోతుందా..? సర్వేలు ఏం చెబుతున్నాయ్..
TDP-Janasena-BJP Alliance 2024 : ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. సార్వత్రిక ఎన్నికలు, ఏపీ సహ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఏపీలో రాజకీయ కాక మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అనే ఉత్కంఠ రాజకీయ పార్టీల్లోనూ, ప్రజల్లోనూ నెలకొంది. దీంతో పలు సర్వే సంస్థలు ఓటర్ల నాడీని పట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా జాతీయ సంస్థలైన ఏబీపీ సీ ఓటర్ సర్వే సంస్థ, నెట్ వర్క్ 18 అనే సంస్థ ఏపీలో లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసింది. ప్రస్తుతం ఈ సర్వే సంస్థల ఫలితాలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
సీ ఓటర్ సర్వే సంస్థ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10 వరకు ఏపీలోని వివిధ వర్గాల ప్రజలను స్వయంగా కలిసి వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంది. దీన్ని బట్టి ప్రమాణికమైన వివరాలు సేకరించింది. దీన్ని శాస్త్రీయ పద్ధతిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసింది.
లోక్ సభ సీట్లు:
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి: 20
ఇందులో టీడీపీ : 17
వైసీపీ : 5
ఇతరులు : 0
ఏపీలో టీడీపీ కూటమి అద్భుత ఫలితాలు సాధించబోతోందని దీన్ని బట్టి అర్థమవుతోంది. కూటమి 20 సీట్లు, వైసీపీకి 5 సీట్లు రానున్నాయి. కూటమికి 44.07శాతం ఓట్లు, వైసీపీకి 41.09శాతం ఓట్లు, ఇండియా కూటమికి 3 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అయ్యే అవకాశం ఉంది.
ఇక నెట్ వర్క్ 18 సర్వే ప్రకారం కూటమికి 18 ఎంపీ స్థానాలు, 50 శాతం ఓట్లు, వైసీపీకి 7 సీట్లు, 41 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 6 శాతం ఓట్లు వస్తాయని అంచనా.
కాగా, సర్వే ఫలితాలపై వైసీపీ మండిపడుతోంది. టీడీపీకి అనుకూలంగా ఒకటి, రెండు సర్వేలు మాత్రమే వచ్చాయని, పదుల సంఖ్యలో సర్వే సంస్థలు వైసీపీదే విజయమని చెప్తున్నాయని అంటోంది. అయితే పార్టీల తీరు ఎలా ఉన్నా.. మరో నెలలో జరుగనున్న పోలింగ్ లో ప్రజా తీర్పే పార్టీల రాతను మార్చబోతోంది. ఇవి అంచనాలు మాత్రమే.
సర్వేలతో ప్రజల్లో అయోమయం పెరగడం తప్ప పెద్దగా ప్రయోజనముండదని విశ్లేషకులు అంటున్నారు. ఎవరెన్ని చెప్పినా ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని అర్థమవుతోంది. దీన్ని కూటమి ఎంత బాగా వాడుకుంటుందో దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.