Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ 400 సీట్లకు పైగా విజయం దిశగా పయనిస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ 80 స్థానాలు దాటింది. ‘‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. ఈ సందర్భంగా కీర్ స్టామర్ కు అభినందనలు తెలియజేస్తున్నాను. దేశంలో అధికారం శాంతియుతంగా, సద్భావనతో చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’’ అని రిచ్ మండ్ అండ్ నార్తర్న్ అలెర్టన్ లోని తన మద్దతుదారులను ఉద్దేశించి రిషి సునాక్ అన్నారు. క్షమించండి.. ఓటమికి తాను బాధ్యత వహిస్తానని రిషి సునాక్ పేర్కొన్నారు.
కన్జర్వేటివ్ కేబినెట్ మంత్రులు ఎనిమిది మంది తమ స్థానాలకు కోల్పోయారు. సునాక్ ఉత్తర ఇంగ్లాండ్ లోని రిచ్ మండ్ అండ్ నార్తర్న్ అలెర్టన్ నియోజకవర్గాల్లో 47.5 శాతం ఓట్లను సాధించారు. రిషి సునాక్ 2022 లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 14 సంవత్సరాలు పాలించిన తరువాత, కన్జర్వేటివ్ పార్టీ అనేక సమస్యలపై ఎదురుగాలిని ఎదుర్కొంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించిన అనంతరం ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం గందరగోళంగా మారింది.