RGV:త్వరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీకి రాజకీయ విశ్లేషకుడిగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ తాజాగా చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలవడం, వచ్చే ఎన్నికల కోసం ప్యూహాలు రచించడం ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేనకు రామ్ గోపాల్ వర్మ `వ్యూహం` ఇబ్బందికరంగా మారింది. వైఎస్ జగన్‌కు అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా ఇది. వైఎస్ జగన్‌ను హీరోగా పోట్రేట్ చేయడమే కాకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను విలన్లుగా చిత్రిస్తూ ఈ సినిమాని వర్మ రూపొందించాడు. అదే ఇప్పుడు టీడీపీ, జనసేనను ఇబ్బందిపెడుతోంది. రానున్న ఎన్నికల్లో ఈ సినిమా తప్పుడు సంకేతాల్ని అందించే అవకాశం ఉందని టీడీపీ, జనసేన శ్రేణులు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని జనసేన, టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ సినిమా విడుదలని ఎలాగైనా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. సినిమాను ఈ నెల 29న ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయాలని వర్మ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే అమరావతి ఉద్యమనేతి కొలికిపూడి శ్రీనివాసరావు ..దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ లైవ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన వర్మ తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. దీంతో షాక్‌కు గురైన యాంకర్ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని ఆయనను రిక్వెస్ట్ చేశారు. అయినా సరే తాను మళ్లీ మళ్లీ ఇవే వ్యాఖ్యలు రిపీట్ చేస్తానని స్పష్టం చేయడం సంచలనంగా మారింది.