TDP MLA : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను టీడీపీ సస్పెండ్ చేసింది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. మహిళను వేధించారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. మరో వైపు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అందుబాటులో లేరని తెలుస్తోంది.
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళతో రాసలీలల్లో పాల్గొంటున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. చెల్లి అంటూనే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆదిమూలంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపైన ఒత్తిడి తెచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. వైరల్ గా మారిన ఈ వీడియోపై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. తమ పార్టీ నాయకులే తనపై కుట్ర చేశారంటూ చెప్పుకొచ్చారు. సదరు మహిళతో తనకు ఏ సంబంధం లేదని, ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్టు కనబడుతోందని అన్నారు. తానేంటో, తన పనితనం ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని ఆదిమూలం పేర్కొన్నారు.