Riots in AP : ఏపీలో అల్లర్లు.. మరో డజను మందిపై ఈసీ వేటు ?

Riots in AP

Riots in AP

Riots in AP : ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌తో సహా పలువురు పోలీస్ అధికారులపై వేటు వేసింది. దాంతో పాటు వారిపై శాఖ పరమైన విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఎన్నికల రోజు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో వైసీపీ నేతలు రెచ్చిపోయి ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. టిడిపికి ఓట్లు వేశారని అనుమానిస్తున్న సామాన్య ప్రజలపై పైశాచికంగా దాడులు చేశారు.

వైసీపీ అల్లరి మూకలను కట్టడి చేయాల్సిన పోలీసులు టీడీపీ నేతలు పిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. రాష్ట్రంలో అల్లర్లు, దాడులపై ముఖేష్ కుమార్‌ మీనా కూడా పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందిస్తూ డిజిపి హరీష్ కుమార్‌ గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డిని నిన్న ఢిల్లీకి పిలిపించి వివరణ కోరింది. అనంతరం అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాలకు చెందిన పలువురు పోలీస్ అధికారులపై బదిలీ, సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారందరిపై విచారణ జరిపించి రెండు రోజులలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది.

వేటు పడిన అధికారులు వీరే :
1. పల్నాడు జిల్లా కలెక్టర్‌: బదిలీ, శాఖపరమైన విచారణ.
2. పల్నాడు, అనంతపురం ఎస్పీలు: సస్పెన్షన్, శాఖపరమైన విచారణ.
3. తిరుపతి ఎస్పీ: బదిలీ శాఖపరమైన విచారణ.
4. పల్నాడు, అనంతపురం, తిరుపతి మూడు జిల్లాలో 12 మంది సీఐ, ఎస్సై స్థాయి అధికారులు: సస్పెన్షన్, శాఖపరమైన విచారణ.

ఈ దాడులకు పాల్పడిన వారందరిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి ఆ వివరాలను కూడా సమర్పించాలని చెప్పింది. ఏపీలో చెలరేగిన ఈ హింసను కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఎంత తీవ్రంగా పరిగణించిందంటే, జూన్ 4న ఫలితాలు వెల్లడించిన తర్వాత కూడా రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తూ, జూన్ 19వరకు రాష్ట్రంలో 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఓటమి భయంతో టిడిపి నేతలే తమపై ఈ దాడులు చేస్తున్నారని వైసీపీ అంటుంటే.. మరో వైపు లేదు వైసీపీ నేతలే మాపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డితో సహా అనేకమందిపై ఈసీ వేటు వేసింది. ఇప్పుడు పల్నాడు జిల్లా కలెక్టర్‌తో సహా మరో డజను మంది పోలీస్ అధికారులపై కూడా వేటు వేసింది. కనుక ఇకనైనా మిగిలిన పోలీస్ అధికారులు వైసీపీ మూకలను కట్టడి చేస్తారా లేదో చూడాలి.

TAGS