Big Breaking:తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అయితే కాబోయే సీఎం ఎవరు? అనే దానిపై రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అయితే తాజాగా తెలంగాణకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అనే విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ భేటీలో అందిన తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నిర్ణయించాలని వెల్లడించారు. దీంతో రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెర పడింది.
తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం ముందుగా అనుకున్నట్టే రాజ్ భవన్‌లో ఉంటుందా? లేక మరో చోట ఉంటుందా? అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు…
సీఎం పదవి కరారు అవుతున్న క్షణాల్లోనే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. `తెలంగాణలో పలు జిల్లాలలో తుపాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి, వరి ధాన్యం తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి` అంటూ అధికారుల అప్పమత్తం చేశారు.
అధిష్టానం పిలుపు…ఢిల్లీ బయలుదేరిన రేవంత్ రెడ్డి
అధిష్టానం పిలుపు మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. గత రెండు రోజులుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఉన్న ఆయనను అత్యవసరంగా ఢిల్లీకి రావాలని అధిష్టానం అదేశించింది. ముఖ్యంత్రి ఎంపికపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలోనే రేవంత్‌ను ఢిల్లీకి పిలిపించుకోవడంతో సీఎం అభ్యర్థి ఆయనే అని స్పష్టమైంది. ముఖ్యమంత్రి రేవంత్ అని తేలడంతో మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై అధిష్టానం రేవంత్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి.
అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి.
— Revanth Reddy (@revanth_anumula) December 5, 2023