Revantha Reddy:తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌ని మించి సీట్లని రాబట్టి మరి కొన్ని గంటల్లో అధికార పీఠాన్ని అధిరోహించబోతోంది. అయితే కాంగ్రెస్ నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేది ఎవరు?. డిప్యూటీ సీఎంలుగా ఎంత మంది, ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? అనే విషయాలపై గత రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఫైనల్‌గా మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రి విషయంలో స్పష్టతనిచ్చింది.
టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డిని సీఎల్పీ లీడర్‌గా ఎన్నుకుని ఆయనని ముఖ్యంత్రిగా ప్రకటించి ఉత్కంఠకు తెరదించింది. దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖారారైపోయింది. గురువారం ఉదయం 10:28 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు భారీ స్థాయిలో హాజరు కాబోతున్నారు. ఇప్పటికే వారిని ఆహ్వానించడం కోసం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు.
అక్కడి పనులు పూర్తి చేసుకుని బుధవారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డి హైదరరాబాద్ బయలుదేరనున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ముహూర్త సమయం మారినట్టుగా తెలుస్తోంది. గురువారం ఉదయం 10:28 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత నిర్ణయించగా..తాజాగా ఆ సమాయాన్ని మార్చినట్టుగా తెలుస్తోంది. గురువారం ఉదయం 10:28 గంటలకు కాకుండా మధ్యాహ్నం 1:04 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం హైదరరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున హైదరాబాద్‌కు తరలి రానున్నారు.