Revanth Reddy:గురువారం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి తనదైన శైలి దూకుడుతో సిక్సర్‌ల మీద సిక్సర్‌లు కొడుతూ వరుస షాకులిస్తున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆరు గ్యారంటీల ఫైల్‌పై సంతకం చేసిన రేవంత్ ఆ వెంటనే రజినీకి ఇచ్చిన మాట ప్రమాకారం ఉద్యోగం ఇస్తూ మలి ఫైల్‌పై సంతకం చేయడం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించి సంచలనం సృష్టించిన రేవంత్‌రెడ్డి అదే దూకుడుతో శుక్రవారం ప్రగతిభవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మార్చి ప్రజాదర్బర్‌ని నిర్వహించారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం మహిళలకు, పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే దూకుడుతో తాజాగా మరో షాక్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు స్పెషల్ ఆఫీసర్లను కూడా రేవంత్ ప్రభుత్వం తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రేవంత్ ప్రభుత్వం తొలగించింది వీరినే…
1. సీఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్
2. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ
3. సాంస్కృతిక, దేవాదాయ సలహాదారు కేవీ రమణాచారి (రీసెంట్ రిజైన్)
4. ప్రభుత్వ ప్రధాన సలహాదారు చెన్నమనేని రమేష్
5. హోంశాఖ సలహాదారు అనురాగ్ శర్మ
6. ముస్లీం మైనారిటీ సంక్షేమ సలహాదారు ఏకె ఖాన్
7. అటవీ సంరక్షణ శాఖ ముఖ్య సలహాదారు శోభ
స్పెషల్ ఆఫీసర్ హోదాలో ఉన్నవారు వీరే..
1. ఇరిగేషన్ అడ్వైజర్ ఎస్కే జోషి
2. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ ఆఫీసర్లు జీఆర్‌రెడ్డి, శివశంకర్
3. ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ ఆఫీసర్లు సుధాకర్ తేజ
4. ఇంధన సెక్టార్ స్పెషల్ ఆఫీసర్లు రాజేంద్ర ప్రసాద్ సింగ్
5. ఉద్యాన శాఖ అడ్వైజర్ శ్రీనివాస్‌రావు
గత ప్రభుత్వ సలహాదారులతో పాటు స్పెషల్ ఆఫీసర్ హోదాలో ఉన్న అధికారుల నియామకాలను రద్దు చేస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీచేయడంతో వీరంతా ఇప్పుడు ఇంటిదారి పట్టనున్నారు. వీరి స్థానంలో ప్రొఫెసర్ కోదండరామ్, మరి కొంత మంది అధికారులను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.