TSPSC Chairman:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ బి. జనార్ధన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ రాజ్‌భవన్ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. జనార్ధన్‌రెడ్డి రాజీనామాను ఆమోదించినట్టుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో రాజ్‌భవన్ వర్గాలు దీనిపై క్లారిటీ ఇచ్చాయి. ఆయన రాజీనామాను ఆమోదించినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అని తెలిపాయి.
సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి బి. జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసందే. ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉన్న గవర్నర్‌కు అన్ని వివరాలు పంపించామని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన రాజీనామాను ఇంకా గవర్నర్ ఆమోదించలేదని ఈ సందర్భంగా రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేయడం విశేషం. గత ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పలు కీలక పరీక్షలు రద్దు కావడం, పేపర్లు లీక్ కావడం తెలిసిందే.
దీనిపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చాల మంది అభ్యర్థులు ఎంతో కాలం కష్టపడి రాస్తే పేపర్లు లీక్ అయి పరీక్షలు రద్దు కావడం ఆవేదనకు గురి చేసిందని వాపోయారు. టీఎస్‌పీఎస్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో చాలా వరకు పేపర్లు లీక్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో పలు సంస్థల చైర్మన్‌లు రాజీనామాలు చేసిన విధంగానే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి తన పదవికి తాజాగా రాజీనామా చేశారు. అయితే దీనికి గవర్నర్ నుంచి ఇంకా ఆమోదం లభించకపోవడం గమనార్హం.