Revanth Reddy : చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం: రేవంత్ రెడ్డి
Revanth Reddy : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో శనివారం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రపంచంతో పోటీపడే విధంగా అన్ని రకాల జబ్బులకు సంబంధించి ఇక్కడే వైద్యం అందేలా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు 18 గంటలు పనిచేస్తారని చెప్పారు. కాబట్టి తాను 12 గంటలు పనిచేస్తే సరిపోదని తాను కూడా 18 గంటలు కష్టపడాల్సిందేనని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని.. అభివృద్ధిలోనూ ఈ రెండు రాష్ట్రాలు ముందు వరుసలో ఉండాలన్నదే తమ అభిమతమని అన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందేనని పేర్కొన్నారు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని, ఈ ఆస్పత్రిని దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సంకీర్ణ రాజకీయాలకు పునాది వేసింది దివంగత ఎన్టీఆరే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.