– కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు
Central Government : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ టైమింగ్స్ పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఉదయం 9 గంటల 15 నిమిషాలకే ఆఫీసుల్లో ఉండాలని, లేదంటే హాఫ్ డే లీవ్ కింద పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది. బయోమెట్రిక్ విధానం కచ్చితంగా ఫాలో అవ్వాలని లేదంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఆదేశాలు జారీ చేసింది.
ఉద్యోగులు ఇకపై బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా వాడాలని, పుస్తకాల్లో సంతకాలు చేస్తే చెల్లవని కూడా కేంద్రం తెలిపింది. ఏదైనా కారణంతో ఓ ఉద్యోగి ఆఫీసుకు రాలేకపోతే ముందు రోజు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని, క్యాజువల్ లీవ్ కు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. కోవిడ్ తర్వాత చాలా మంది ఉద్యోగులు ఈ నిబంధనలు పాటించడం లేదు. దీంతో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.