Central Minister Nirmala: తెలుగు రాష్ట్రాలకు పంగనామం పెట్టిన నిర్మలమ్మ..!

నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తు్న్న ఏ అంశం గురించీ ప్రస్తావనకు రాలేదు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకీ ఎన్నికలు జరగను న్నాయి.ఈ నేపథ్యంలోనైనా ఏపీకి కొన్ని ఊరట కలిగించే నిర్ణయాలు ప్రకటిస్తాయని భావించిన వారికి మరోసారి నిరాశే ఎ దు రైంది.

ముఖ్యంగా ఏపీకి జీవనాడిగా చెబుతున్న పోలవరం గురించి ఒక్కమాటైనా మాట్లాడలేదు. నిర్వాసితులకు రూ.32 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తేల్చినా.. నేటి బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పెండింగ్ పనులు, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కొవ్వూరు-భద్రాచలం, కోటిపల్లి-నరసాపురం వంటి పలు రైల్వేలైన్ల ముచ్చట లేనేలేదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.683 కోట్లు కేటాయించాలనీ, సంస్థను ప్రైవేట్‌ పరం చేయొద్దనీ కోరుతున్న ఏపీ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా నేటి బడ్జెట్‌లో ఎలాంటి హామీ లభించలేదు. రాజధాని లేని రాష్ట్రంగా చెప్పబడుతున్న ఏపీకి కనీసం.. మౌలిక సదుపాయాల కల్పన కోసమైనా ఏదైనా ప్రకటిస్తారనే ఆశ కూడా అడియాశగానే మిగిలింది.

అతిపెద్ద తీరప్రాంతం ఉన్న ఏపీకి ఓడరేవుల అభివృద్ధికి గానీ, పెండింగ్‌లో ఉన్న భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి నిధుల జాడ గానీ బడ్జెట్‌లో కనిపించనే లేదు.ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్‌ యూనివర్శిటీ, పెట్రోలియం యూనివర్శిటీలకు నిధుల కేటాయింపులు, ఆక్వా సాగుకు ప్రోత్సాహకాల వంటి అంశాలనూ నిర్మలమ్మ పద్దు మూలన పారేసింది.

అటు తెలంగాణలోని పెండింగ్ అంశాల గురించి కూడా ఆమె పట్టించుకోనేలేదు. పారిశ్రామిక పార్కుల కేటాయింపు, సింగరేణి ఐఐటీ హైదరాబాద్‌, మణుగూరు ప్లాంట్లకు నిధుల కేటాయింపు గురించిన ప్రస్తావన లేనేలేకపోయింది.

హైదరాబాద్‌లోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలనే డిమాండ్ గురించీ మాట్లాడనే లేదు.

ఇక.. పదేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలు రెండూ ఉమ్మడిగా కేంద్రాన్ని కొన్ని అంశాలమీద దృష్టి పెట్టాలని కోరుతూ వచ్చాయి. వాటిలో కేంద్ర పన్నుల్లో లభిస్తున్న వాటా పెంపు, పెట్రోలు, డీజిల్‌ ధరలపై సుంకాలు, పీఎం ఆవాస్‌ యోజన కేటాయింపుల పెంపు తదితర అంశాల గురించీ ఈ బడ్జెట్ మాటమాత్రంగానైనా ప్రసావించలేదు.

TAGS