Sachin Pilot : మోదీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యవహరించిన తీరును సచిన్ గుర్తుచేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించినట్లు సూచిస్తున్నాయని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించకూడదని పేర్కొన్నారు.
‘‘ఈ ఫలితాల విషయంలో బీజేపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ కు సుమారు 200 సీట్లు వచ్చాయి. అప్పుడు రాజీవ్ గాంధీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరగా.. ప్రజల తీర్పు తనకు అనుకూలంగా రాలేదని తిరస్కరించారు. దాంతో అప్పుడు తర్వాత స్థానంలో ఉన్న పెద్ద పార్టీకి పిలుపు వచ్చింది’’ అని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు బీజేపీ, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్నాయని మీడియాతో మాట్లాడుతూ సచిన్ పైలట్ అన్నారు.