Amaravati : గ్రహణం వీడి.. కళకళలాడుతున్న అమరావతి
Amaravati : వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి కూటమి గెలుపుతో కొత్త కళ సంతరించుకుంటోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటివరకు రాత్రిళ్లు చీకటిమయంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు నేడు విద్యుత్తు వెలుగులతో కళకళలాడుతోంది.
మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు 8 కిలోమీటర్ల మేర విద్యుత్తు స్తంభాల పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. సోమవారం రాత్రి ఈ రహదారిపై విద్యుత్తు దీపాల వెలుగులు కనులవిందు చేశాయి. అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకు వచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.