KTR:ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమీపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అవుతూ ప్రజాభిప్రాయానికి కట్టుబడి ఉంటామని, ప్రతిపక్ష పార్టీ హోదాలో సమర్థవంతంగా పనిచేస్తామని ఆయన తేల్చి చెప్పారు. అందుకు తగ్గట్టుగా కేటీఆర్ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ముద్ర వేసేలా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆట ఇప్పుడే మొదలైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు.
సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు కేటీఆర్. మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు.
మొన్నటివరకు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు. కానీ, మేము ఏటా పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇచ్చాం. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని కాంగ్రెస్ వాళ్లు చెప్తారు. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్పిస్తారు ” అంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.