KTR BRS:తెలంగాణలో ప్రభుత్వం చేతులు మారింది. ఊహించని విధంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టంకట్టడంతో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మొదటి మంత్రి వర్గ విస్తరణ కూడా జరిగింది. ఇటీవలే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 23 గంటల, 33 నిమిషాల పాటు చర్చ జరిగింది. అధికార పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
బీఆర్ఎస్ పదేళ్ల పాలన, అప్పులపై శ్వేత పత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ విమర్శలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి, శాసన సభ్యులు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పదేళ్ల పాలనలో ఎంతో అభివృద్దిని సాధించామని వాస్తవాలు దాచిపెట్టి తప్పుల తడకగా శ్వేత పత్రాన్ని విడుదల చేశారని ఫైర్ అయ్యారు. అంతే కాకుండా శుక్రవారం సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.
శ్వేతపత్రానికి కౌంటర్‌గా బీఆర్ఎస్ `స్వేద పత్రం`…
`తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలూ రాత్రి తేడా లేకుండా..రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం..అందుకే గణాంకాలతో సహా..వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు..అప్పులు కాదు..తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు..తెలంగాణ భవన్ వేదికగా 23వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు “ స్వేద పత్రం ” పవర్ పాయింట్ ప్రెజెంటేషన్` అంటూ నెట్టింట పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయంపగలూ రాత్రి తేడా లేకుండా..
రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..
అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే…
— KTR (@KTRBRS) December 22, 2023