N Convention : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో హై కోర్టు కీలక ఆదేశాలు..
N Convention : మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హీరో యువ సామ్రాట్ నాగార్జున తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారంటూ నాగార్జున తరుపున న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై ఎక్స్(ట్విట్టర్) లో సోషల్ మీడియా వేదికగా నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని, వాస్తవాలను తెలిపేందుకేనని వెల్లడించారు.
ఆది భూమి పట్టా భూమి. అంగుళం కూడా ఆక్రమించలేదు.. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమని పేర్కొన్నారు. కూల్చివేత పై గతంలో ఇచ్చిన నోటీసుపై స్టే కూడా మంజూరు చేసింది. తప్పుడు సమాచారంతో కూల్చివేశారని పేర్కొన్నారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని నాగార్జున పేర్కొన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని, చట్టాన్ని గౌరవించే పౌరుడినని, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, ఆ కూల్చివేతను తానే చేపట్టేవాడినని పేర్కొన్నారు.
తాజా పరిణామాల వల్ల, తాము అక్రమంగా స్థలం చేశామని, తప్పుడు నిర్మాణాలు చేశామని, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని పేర్కొన్నారు. ఆ తప్పుడు అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. చట్ట విరుద్ధ చర్యలను వ్యతిరేకిస్తూ తాము కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని నాగార్జున ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. నాగార్జున తరపున న్యాయవాది వేసిన పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ విచారణ జరిపారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.