Kejriwal : ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి లొంగిపోనున్నారు. శుక్రవారం ఆన్ లైన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జూన్ 2న నేను లొంగిపోవాలి. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయలుదేరతా. ఈసారి వాళ్లు నన్ను మరింతగా వేధిస్తారు. అయినా నేను తలవంచను’’ అని చెప్పారు. ఢిల్లీ ప్రజలకు అన్ని రకాల సేవలు యథాతథంగా అందుతాయని ఆయన హామీ ఇచ్చారు.
‘‘ఈసారి ఎన్ని రోజులు జైల్లో ఉంటానో తెలియదు. దేశాన్ని నియంతృత్వం నుంచి రక్షించేందుకు జైలుకు వెళుతున్నాను. దానికి గర్వంగా ఉంది. వారు నన్ను అణచివేయానికి ప్రయత్నించారు. నా ఔషధాలను అడ్డుకున్నారు. అరెస్టు సమయంలో 70 కిలోలుగా ఉన్న నా బరువు ఇప్పుడు 6 కేజీలు తగ్గింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బరువు పెరగలేదు. దాంతో కొన్ని పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు నెలకు రూ.1,000 ఇచ్చే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.