Hanuman Jayanti : జూన్ 1 హనుమాన్ జయంతి.. తిరుమలలో ఉత్సవాలు

Hanuman Jayanti

Hanuman Jayanti

Hanuman Jayanti 2024 : తిరుమలలో  ఈరోజు నుంచి ఐదవ తేదీ వరకు హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అంజనాద్రి ఆకాశగంగా ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా ఆకాశగంగలో శ్రీబాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించడంతో పాటు జపాలీ తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అంజనాద్రి ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 8-30 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేకం నిర్వహించనున్నారు.

మొదటి రోజు జూన్ 1వ తేదీన మల్లెపూలతో, జూన్ 2వ తేదీన తమలపాకులతో, 3వ తేదీన ఎర్రగన్నేరుతో, కనకాంబరాలతో, 4వ తేదీన చామంతితో, చివరి రోజు జూన్ 5వ తేదీన సింధూరంతో అంజనాద్రి శ్రీబాలాంజనేయ స్వామికి అభిషేకం చేస్తారు. పండితులచే శ్రీఆంజనేయస్వామి సహస్ర నామార్చనలతో పాటు మంత్రోచ్ఛారణల మధ్య హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు.

ఉదయం 10 గంటలకు ఆకాశగంగ వద్ద శ్రీఆంజనేయ జన్మ వృత్తాంతంపై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జపాలిలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య దాస సాహత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణాన్ని నిర్వహిస్తారు. జూన్ 1వ తేదీన హరికథ, 2వ తేదీన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంకీర్తనలు, 3వ తేదీన పురందరదాసు సంకీర్తనలు నిర్వహిస్తారు. ప్రతి రోజు సాయంత్రం   ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు కూడా ఉంటాయి.

TAGS