Dastagiri-Comments: వివేకాను చంపిందెవరో చెప్పి జగన్ ఓట్లు అడగాలి..దస్తగిరి సంచలన వ్యాఖ్యలు
ఈసారి వివేకాను చంపిందెవరో చెప్పి జగన్ ఓట్లు అడగాలని వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జైలు నుంచి విడుదలైన దస్తగిరి జైలు దగ్గర ఈ విధంగా స్పందించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే నా నివాసం అని అయినా భయపడనని ఆయన అ న్నారు. చావడానికైనా సిద్ధమే గానీ.. సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పష్టం చేశారు.
పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే తాను నివాసం ఉంటానని ఎవరికి బయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వివేకా హత్యకు సంబంధించి తప్పుచేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్ గా మారానని, ఇప్పుడు సీఎం, ఎంపీల మాటలు విని మళ్లీ తప్పు చేసి పాపం మూటకట్టుకోదలచుకోలేదని పేర్కొన్నారు.
ఎట్రాసిటి,దాడి కేసుల్లో నాలుగు నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్న దస్తగిరి బెయిల్ పై శుక్రవారం విడుదలయ్యయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో వివేకా హత్యను అడ్డం పెట్టుకుని జగన్ సానుభూతితో గెలుపొందారని, ఇప్పుడు అదే కుట్రతో మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వివేకా కేసులో అప్రూవర్ గా ఉన్నాననే ఉద్దేశంతోనే కుట్ర పన్ని, కేసుల్లో ఇరికించి వైకాపా పెద్దలు తనను జైలుకు పంపారని చెప్పారు. కడప జైల్లో ఉన్న సమయంలో వివేకా కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి తనను కలిశారని డబ్బు ఆశ చూపి రాజీకి రావాలని అభ్యరించారని దస్తగిరి తెలిపాడు