CPI Narayana: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను అబద్దాలు చెప్పిందే కాక ఇప్పుడు గవర్నర్ చేత కూడా అబద్దాలు చెప్పిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై రామకృష్ణ స్పందించారు. గవర్నర్ ప్రసంగ పాఠం ఒక అబద్దాల పుట్ట అని ఆయన ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యాసంస్కరణలు చేపట్టామని చెప్పడం బోగస్ అన్నారు.
దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి తరలిపోయారంటే విద్యారంగం ఏ మేరకు కుంటుపడిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. పైగా కేసుల్లో కూరుకుపోయిన వివాదాస్పదమైన బైజూస్ కంపెనీకి వందల కోట్ల ప్రభుత్వ నిధులు దోచి పెట్టారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు కాబట్టే ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీని అనుమతించడం లేదన్నారు. ఇరిగేషన్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
గండికోట ప్రాజెక్టులో 27 టీఎంసీల నీటిని నిల్వ చేసినప్పటికీ ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరు ఇచ్చిన పాపాన పోలేదు. ప్రాజెక్టు కింద కాలువలు తవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడం వల్ల అన్నమయ్య, ఫించా ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి.
ఉచిత విద్యుత్ కు మంగళం పాడేందుకు సిద్ధమయ్యారని గత నాలుగున్నర ఏళ్లలో దాదాపు రూ.57 వేల కోట్ల విద్యుత్ భారాలను ప్రజలపై మోపా రన్నారు. విశాఖలో జరిగిన సమ్మిట్ లో రూ.13 లక్షల 11 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ చెబుతున్నారు. అసలు ఆ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయని, ఏఏ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని ప్రశ్నిస్తున్నాం అన్నారు.
గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరుతో విద్యార్థులను గందరగోళంలోకి నెట్టారని నాడు`నేడుతో స్కూల్స్ రూపురేఖలు మార్చినా, అవి బల్లలు, సున్నాలకే పరిమితమైంది. ఉపాధ్యాయులు ఉంటే కదా పాఠశాలలకు నిండుదనం. 25 వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీతో స్కూల్స్ వెలవెలబోతున్న వాస్తవాన్ని ఎందుకు చెప్పలేదు. పైగా మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు కేవలం 4000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను దగా చేశారు.అమ్మఒడి, విద్యాకానుక పథకాల్లో కోతలు నేటికీ విద్యార్థుల తల్లులను వేధిస్తున్న సమస్య. పైగా కొన్ని విడతలను ఎగ్గొట్టి మోసం చేసిన ఘనత జగన్‌దే. 1వ తరగతి నుంచే ఐటీ విధానమంటూ సరికొత్త మోసానికి తెరతీస్తున్నారు. సిబ్బంది లేకుండా, నియామకాలు లేకుండా, ఎక్విప్‌మెంట్ లేకుండా డిజిటల్ విధానం ఎలా వస్తుందో అర్థం కావడం లేదన్నారు.