హమ్మయ్య పెంపుడు కుక్క మొక్కు ముట్టింది.. హా అదేంటి.! కుక్క మొక్కెంటి..? విచిత్రంగా ఉంది కదూ..? మేడారం జాతరలో ఇలాంటి వింతలు విచిత్రాలు ఇంకా చాలానే ఉంటాయి.. కుక్క ఆరోగ్యం కుదుటపడాలని సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు మొక్కారు..కోరికలు తీర్చే కొంగుబంగారం సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించడంలో వింతలు – విశేషాలు చూపర్లను ఆశ్చర్య పరుస్తున్నాయి.. కోరికలు తీరితే భక్తులు మనిషి ఎత్తు బంగారం- అదేనండి నిలుఎత్తు బెల్లం సమర్పిస్తారు.. కానీ కుక్క ఆరోగ్యం బాగుండాలని మొక్కి నిలువెత్తు బంగారం సమర్పించిన కుటుంబాన్ని చూశారా…? మేడారం జాతరలో ఇలాంటి వింతలు జరిగాయి.
బిక్షపతి – జ్యోతి దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్నపెంపుడు కుక్క లియో కు గత జాతర సమయంలో సుస్తి చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఏమీ తినకుండా అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో వారికి ఏమి తోచక సమ్మక్క,సారక్క జాతరకు వచ్చి కచ్చితంగా నిలువెత్తు బంగారం సమర్పిస్తామని సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు మొక్కుకున్నారట…విచిత్రం ఏమిటంటే మొక్కిన మూడోరోజు నుండే ‘లియో” ఫుల్ యాక్టీవ్ అయిందట…వాళ్ళ మొక్కు ఫలించింది.. లియో పూర్తి ఆరోగ్యంతో ఇంట్లో గంతులేస్తుంది..
కుటుంబ సభ్యులు అందరితో కలిసి మెలిసి తిరుగుతుంది.. దీంతో సమ్మక్క సారక్క దేవతలకు ఆ కుటుంబం మొక్కు తీర్చుకున్నారు.. “లియో”ను తీసుకెళ్లి కాంటాలో కూర్చోబెట్టి నిలువెత్తు బంగారం తులాభారం వేశారు..పెంపుడు కుక్క ఆరోగ్యం కుదుటపడాలని మొక్కులు మొక్కిన ఈ కుటుంబం ఆ కుక్క పేరిట నిలువెత్తు బంగారం సమర్పించి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కు తీర్చుకున్నారు.. ఈ విచిత్ర సంఘటన హనుమకొండ లో జరిగింది..