Heavy rain : ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం.. ఆందోళనలో ప్రజలు
Heavy rain in NTR District : ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వాన మొదలైంది. విజయవాడ సమీపంలోని కంచికచర్లలో భారీ వర్షం కురుస్తోంది. వరదల కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రజలు మరోసారి వర్షాలు కురుస్తుండంతో ఆందోళన చెందుతున్నారు. కాగా బుడమేరు ఎడమ కాల్వకు 3 గండ్లను ఆర్మీ సిబ్బంది పూడ్చివేశారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న ప్రాంతాంలోనూ (సెప్టెంబరు 7) మధ్యాహ్నం వర్షం కురుస్తోంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు (సెప్టెంబరు 10 వరకు) భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలను అలర్ట్ చేసింది. అల్లూరి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సముద్రంలో మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ చెప్పారు. ఈ హెచ్చరికలతో.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అలెర్టయ్యారు. వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.