Heavy Rain : బెంగళూరులో భారీ వర్షం
Heavy Rain in Bengaluru : కర్నాటక రాజధాని బెంగళూరులో కుంభవృష్టి కురిసింది. ఆదివారం ఒక్కరోజే 111 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో 133 ఏండ్ల రికార్డుు బ్రేక్ చేసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో 140.7 మి.మీ. వర్షం కురిసిందని బెంగళూరులోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్త ఎన్ పువియరాసన్ తెలిపారు. అలాగే, ఆదివారం 111 మి.మీ. వర్షపాతం నమోదైందని, ఇది జూన్ నెల సగటు వర్షపాతం (110.3 మి.మీ.)ను ఒక్క రోజులోనే అధిగమించిందని చెప్పారు. 1891 జూన్ 16న ఒకే రోజు అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.
భారీ వర్షం కారణంగా బెంగళూరు సిటీ అస్తవ్యస్తమైంది. చెట్లు కూలిపోయి, వీధులన్నీ జలమయమై జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ట్రినిటీ మెట్రో స్టేషన్ సమీపంలోని మెట్రో ట్రాక్ పై ఆదివారం రాత్రి చెట్టు కూలి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కాగా, బెంగళూరులోని ఐఎండీ సెంటర్ హెడ్ సీఎస్ పాటిల్ ఈ నెల 5 వరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన పరిస్థితులను ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.