JAISW News Telugu

polytechnic : గుడ్ న్యూస్.. ఏపీలో రాత్రి వేళల్లో పాలిటెక్నిక్ చదివేందుకు అవకాశం

polytechnic

polytechnic

polytechnic study in night : పగలు పనిచేసి, రాత్రివేళ తరగతులకు హాజరై పాలిటెక్నిక్ చదవాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక కష్టాలు సహా పలు కారణాలతో పది, ఐటీఐలతో ఎంతో మంది చదువు మధ్యలో ఆపేసి, ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి వారి కోసం ఏపీ ప్రభుత్వం రాత్రి వేళ పాలిటెక్నిక్ తరగతులకు అనుమతించింది. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు రాత్రి పూట చదువుకునేందుకు వీలుగా 6 పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు, ఆదివారాల్లో పూర్తిగా తరగతులు నిర్వహించనున్నారు.

విశాఖలో 3 కళాశాలలకు, చిత్తూరులో 2, రాజమహేంద్రవరంలో 1 కళాశాలలకు రాత్రి పూట తరగతుల నిర్వహణకు అనుమతించారు. ఆయా కళాశాలల్లో 429 సీట్లు అందుబాటులో ఉండగా, ఆసక్తి ఉన్నవారు ఈనెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఎంపిక చేసుకున్న కళాశాలల్లోనే అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దరఖాస్తుదారులు ఉద్యోగం చేసే ప్రాంతం, లేదా నివాసం విద్యాసంస్థకు 50 కి.మీ. లోపు ఉండాలనే నిబంధన ఉంది. ఈ డిప్లొమా మూడేళ్లు కాగా.. ఈ విధానంలో రెండేళ్లు, రెండున్నరేళ్ల కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.  ఈ నెల 28న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ కు వచ్చేవారు అర్హత ధ్రువపత్రాలు, చెల్లించాల్సిన ఫీజుతో ఆయా పాలిటెక్నిక్ లకు నేరుగా హాజరు కావాలని సూచించారు.

Exit mobile version