Gaddar award :గద్దర్ అవార్డు ఏ సినిమాలకు?
‘తెలంగాణ సినిమానా? ‘…అదేంటీ?? బి.నర్సింగరావు తీసిన ‘మాభూమి ‘, ‘ రంగులకల ‘ లాంటివా? తెలంగాణ సినిమా అని ప్రత్యేకంగా వుంటుందా? ఎప్పటికైనా తెలుగు సినిమానే వుంటుంది. నువ్వేదో పిచ్చిగా మాట్లాడుతుంటావ్… తెలంగాణ రాకముందు…15, 20 ఏళ్ళ క్రితం తెలంగాణవాడినై వుండి ఫిల్మ్ క్రిటిక్ గా నా అభిప్రాయాలను వెల్లడించిన క్రమంలో చాలామంది సినిమావాళ్ళు ఎద్దేవా చేసేవారు. కానీ నా నిశ్చిత అభిప్రాయం ఒక్కటే. సాహిత్యం, సంస్క్రుతి బలంగా వున్న ఎక్కడైనా ఆ ప్రాంతపు కళారూపాలు… వాటికి కొనసాగింపుగా స్రుజనాత్మకమైన సినిమా కూడా పుట్టుకొచ్చింది కదా (బెంగాల్, మరాటీ, కన్నడ, మలయాళం, తమిళ్, ఒరియా…) తెలంగాణ సినిమా ఎందుకు రాదు? ఈ ప్రశ్నను అప్పట్లో ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.
12 ఏళ్ళ క్రితం…
‘నమస్తే తెలంగాణ ‘ పేపర్ పెడుతున్నప్పుడు తెలంగాణ కు సినిమా అవసరం లేదని, సినిమా పేజీ వద్దని అన్నారు. కానీ పత్రిక ప్రారంభ బ్రుందంలోని ముఖ్యులలో ఒకడిగా ‘ తెలంగాణ సినిమా (అప్పటికి) సంఖ్యాపరంగా లేకపోవచ్చు. కానీ మంచి సినిమాను మనవాళ్ళకు పరిచయం చేస్తే మంచిదే కదా అని ఆ బాధ్యతను తలకెత్తుకున్నాను. డైలీ సినిమా పేజీకి ‘టాకీస్ ‘ అని, వీక్లీ సినిమాకు ‘ రంగులకల ‘ అని పెట్టాను. చాలా ఆర్టికల్స్ రాశాను. రాయించాను.
తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగు సినిమాకు ఇక్కడి కాంటెస్ట్ లో నంది అవార్డులనేవి అర్థరహితం. ఆమధ్య సిం హా అవార్డులన్నరు… ఇప్పుడు గద్దర్ అంటున్నరు. పేరు ఏదైనా ఆ అవార్డులు ఏ సినిమాలకు, ఏ నటీనటులకు ఇస్తున్నాం. మెయిన్ స్ట్రీం లో తెలుగు సినిమా ఎలాగూ వుంటుంది. దానితో పేచీ లేదు. కానీ ఒక పాయగా తెలంగాణ సినిమా వుండాలి కదా. సంఖ్యాపరంగా తెలంగాణ సినిమాలు లేవు కాబట్టి అవార్డుల అవసరం ఇప్పుడే లేదు. గద్దర్ పేరును తెలుగు సినిమాలకు ఇవ్వడం అంటే ఆయనను కచ్చితంగా తక్కువ చేయడమే. దానికి బదులు ఏడాదికి ఒక తెలంగాణ సినిమాకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా, మిగతావారు గొప్పగా చెప్పుకునేలా కోటి రూపాయల ప్రైజ్ తో గౌరవిద్దాం (క్రీడాకారులకు ఇస్తున్నాం కదా). ఇదీ తెలంగాణ సినిమా అని చాటుదాం. భుజాలపై ఎత్తుకుందాం.
నిజానికి అవార్డుల కన్నా ఇప్పుడు తెలంగాణ కు కావాల్సింది ‘తెలంగాణ సినిమా ‘ అభివ్రుద్ధి. తెలుగు సినిమాతో కలిసి వున్నంత కాలం అది జరగదు. మనదైన ప్రత్యేక ఆలోచనకు ఆస్కారం వుండదు. అందుకే ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేకంగా ఒక పాలసీ తీసుకు రావాలి. ఆ పాలసీ తెలంగాణ సినిమా నిర్మాణానికి దిక్సూచి లా వుండాలి. మన సాహిత్యాన్ని, సంస్క్రుతిని, చరిత్రను పాపులర్ లేదా సెమీ కమర్షియల్ సినిమాలుగా మలిచే దిశగా ఆలోచించి అడుగులు వేయాలి. ఈ ప్రయత్నం జరిగితే కచ్చితంగా ఏడాదికి 120 తెలుగు సినిమాలతో పాటు 20 తెలంగాణ సినిమాలు కూడా వస్తాయి. మిగతా వాటితో అన్ని వేదికలపై పోటీ పడతాయి. లేదంటే మనకున్న ‘బలగం ‘ చెదిరిపోయి తెలంగాణ (వారికి) సినిమా ‘రంగుల కల ‘గానే మిగులుతుంది.
-చల్లా శ్రీనివాస్