Delhi Minister Atishi : క్షీణించిన ఢిల్లీ మంత్రి అతిషి ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

Delhi Minister Atishi
Delhi Minister Atishi : ఢిల్లీలో నీటి సంక్షోభంపై నిరాహార దీక్ష చేస్తున్నఆప్ మంత్రి అతిషి ఆరోగ్యం రాత్రి క్షీణించింది. ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సంజయ్ సింగ్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు అతిషిని అర్థరాత్రి లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అతిషిని పరీక్షించిన వైద్యులు షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆతిషి రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయి 36కు చేరాయని అన్నారు.
ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆతిషి ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని వైద్యులు తెలియజేయంతో, తాము ఆమెను ఆస్పత్రిలో చేర్చామని అన్నారు. ఆతిషి ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జలమండలి మంత్రి అతిషి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జూన్ 21న ఉపవాస దీక్షకు ముందు ఆమె బరువు 65.8 కిలోలు. నిరాహార దీక్ష నాలుగో రోజుకు ఆమె బరువు 63.6 కిలోలకు తగ్గింది. నాలుగు రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయి 28 యూనిట్లు తగ్గింది. రక్తపోటు స్థాయి కూడా తగ్గింది. ఇది ప్రమాదకరమని చెప్పడంతో ఆమెను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు.