Deputy CM Pawan : ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో మొదటి రోజు ప్రొటెం స్పీకర్ గా ఎన్నిక కాబడ్డ టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత మరో టీడీపీ సీనియర్ నాయకుడిని స్పీకర్ గా ఏకగ్రీవంగా సభ ఎన్నుకుంది. రెండో రోజు స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని సభ్యులంతా అభినందిస్తూ తమ తొలి ప్రసంగాన్ని ఇవ్వటంతో సభ ముగిసింది. అసెంబ్లీ సెషన్స్ ముగిశాక ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని చూశారు. వెంటనే అక్కడికక్కడే కాన్వాయి ఆపేసి ఆఫీసు ముందు కుర్చీలు వేసుకొని బాధితులతో మాట్లడారు. వారి గోడు విన్న పవన్ కల్యాణ్ బాధితుల నుండి వినతి పత్రాలు తీసుకున్నారు. కొన్ని అర్జీలకు సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.