Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా వెలుపల క్యూలైన్ లో వేచి ఉన్నారు. కాగా, నిన్న శ్రీవారిని 67,223 భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,549. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు.
శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో గత మూడు రోజులుగా నిర్వహించిన జ్యేష్టాభిషేక మహోత్సవం గురువారంతో ముగిసింది. అందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం కవచాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత అర్చకులు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి అక్కడ వేడుకగా స్నప తిరుమంజనం నిర్వహించారు. అనంతరం విశేషంగా అభిషేకం చేసి, కవచ ప్రతిష్ఠ, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం చేపట్టారు. తర్వాత కవచాలకు పూజలు, హారతి సమర్పించి స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు.
సాయంత్రం ఉభయ నాంచారులతో కలిసి స్వామివారు తిరుచ్చిపై అధిరోహించి ఆలయ ప్రధాన వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్ రావు, టెంపుల్ ఇన్ స్పెక్టర్ ధనుంజయులు, రాధాకృష్ణ పాల్గొన్నారు.