Congress Party:తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా సత్తా చాటింది. మ్యాజిక్ ఫిగర్ ని మించి సీట్లు సాధించడంతో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ఇచ్చిన తరువాత కాంగ్రెస్ తొలిసారి అధికారాన్ని చేపడుతున్న నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ విజయం సాధిస్తే నేను సీఎం అవుతానంటే నేను సీఎం అవుతానంటూ సీనియర్‌లు ఇప్పటికే స్టేట్‌మెంట్‌లు ఇచ్చేశారు.
అయితే పార్టీ ప్రకారం సీఎల్పీ నేతనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో దీనికి సంబంధించిన సీఎల్పీ సమావేశం ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, డీకే శివకుమార్‌తో పాటు పార్టీ కీలక నేతలంతా పాల్గొన్నారు.
సమావేశం అనంతరం అంతా సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. అనంతరం ఆ నిర్ణాయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి పంపిస్తారు. దీనిపై కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రానికి సీఎం అభ్యర్థిని ప్రకటించి ప్రమాణ స్వీకారాన్ని రాజ్ భవన్‌లో చేయించాలని ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మరో వైపు కాంగ్రెస్ ముఖ్య నేతలతో డీకె శివకుమార్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్క్ హయత్ హోటల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదల రాజనర్సింహ, కోమటి రెడ్డి సోదరులతో పాటు పలువురు డీకేతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది.