Mallu Ravi : కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివారని ప్రచారం చేస్తున్న నాయకులు ఆ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా..? అని ప్రశ్నించారు. ఆ కళాశాల వారే పట్టభద్రులు, మిగతా వారు కాదన్నట్లుగా మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో వారి మాటల్లోనే తెలుస్తోందని అన్నారు. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఈసీ అంగీకరించిందని, కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలన్నారు. ఆ వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ వస్తున్నారని తెలిపారు. ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు. తెలంగాణ సాధన కోసం పనిచేసిన అన్ని పార్టీలను వేడుకలకు ఆహ్వానిస్తున్నామని మల్లు రవి తెలిపారు.