కేసీఆర్ ఎక్స్‌పైర్డ్ మెడిసిన్ లాంటి వారని, అధికారం పోవడాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పట్ల ఆయనకు కమిట్‌మెంట్ లేదని విమర్శించారు. ఉంటే.. ఉభయసభలను ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగానికి, శాసనసభ బీఏసీ సమావేశానికి కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. శాసనసభకు కేసీఆర్ బరాబర్ రావాలని, ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత నిర్వర్తించాలనే తాను కోరుకుంటానన్నారు. కానీ ఆయనకే మొహం లేక రావట్లేదన్నారు. ప్రజలు కూడా కేసీఆర్, బీఆర్‌ఎస్ గురించి పట్టించుకోవడం, ఆలోచించడం మానేశారన్నారు.
మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్‌చాట్‌గా మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిపై నిబంధనల ప్రకారమే ప్రభుత్వం పని చేస్తుం దని స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని, రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించుకోవాలని హైకోర్టు సూచించినట్లు వెల్లడిం చారు. దీనిపై మంత్రివర్గంలో గానీ, అసెంబ్లీలో గానీ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మిషన్ భగీరథపైనా విచారణకు ఆదేశించామన్నారు. కాళేశ్వరం అవినీతిని పక్కదారి పట్టించేందుకు కేఆర్‌ఎంబీ అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని విమర్శించారు. ఏపీ మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. బేసిన్లు లేవు.. బేషజాలూ లేవు.. అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే తెలంగాణ పట్ల ఆయనకున్న కమింట్‌మెంట్‌ను తెలియజేస్తోందన్నారు. కేసీఆర్ కమిట్‌మెంట్‌పై ఆయన మేనల్లుడు హరీశ్‌కూ అనుమానం ఉందన్నారు.
పకడ్బందీగా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు
ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయం మార్పు అన్నది స్పీకర్ నిర్ణయమని చెప్పారు. బీఏసీ సమావేశానికి బీఆర్‌ఎస్ తరపున కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్లు మాత్రమే ఇచ్చారని, ఇచ్చిన పేర్లలో హరీశ్‌రావు పేరు ఉంటే ఎందుకు అడ్డుకుంటామని ప్రశ్నిం చారు. అనుమతించాలా.. లేదా అన్నది స్పీకర్ నిర్ణయమని స్పష్టం చేశారు.
రేపు కేటీఆర్‌కు బదులుగా హిమాన్షు వస్తానంటే.. అనుమతించేస్తామా? అని నిలదీశారు. కులగణనపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తనను కలవడంపై స్పందిస్తూ.. సీఎం తాను ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే కేసీఆర్‌నూ కలుస్తానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందిస్తూ ఆయన ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్ అని అలాంటి వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాగాంధీని కలిసి కోరామని తెలిపారు.
ఇసుక అంతా.. అవినీతి దందా..
‘ఇసుక అక్రమ రవాణా పై ఈ నెల 3 నుంచి రవాణా విభాగంతో నిజామాబాద్ ,వరంగల్ రూట్లలో అకస్మికంగా తనిఖీలు చేయించాను. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే.. 22 లారీలకు అసలు అనుమతే లేదు. ఒకే పర్మిట్, ఒకటే నెంబర్‌తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్లు తేలింది. ఈ లెక్కన మొత్తం ఇసుకలో 25 శాతానికిపైగా అక్రమంగా తరలిపోతోంది.. అక్రమాలను గుర్తించాల్సిన టీఎ్‌సఎండీసీ అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా?’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎ్‌సఎడీసీ అధికారులతో గురువారం సచివాలయంలో సమీక్షించారు. ప్రస్తుత ఇసుక విధానం అవినీతి దందాగా మారిందన్నారు. ఇసుక అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని, 48 గంటల్లోగా అధికారులు పద్ధతి మార్చుకోవాలని గడువు విధించారు.
నాయకుల జోక్యం ఉండదు.
భూగర్భ, గనుల శాఖలో అవినీతిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పై అధికారులు తమ సమస్యలనూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీనిపై సీఎం స్పందిస్తూ.. ’’ఇప్పుడు మీపై ఎవరి ఒత్తిడి ఉండదు. అవినీతి, అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి.. అక్రమాలను అడ్డుకోకుండా మీ విధుల్లో ఎవరూ జోక్యం చేసుకోరు’’ అని చెప్పినట్లు తెలిసింది..