Chandrababu : ఆంధ్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబేనని చెప్పుకొచ్చారు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సీఐఐ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. పారిశ్రామిక వేత్తలకు మెరుగైన రాయితీలు కల్పించి పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడంలో ముందుంటామన్నారు.
త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని రూపొందిస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సుముఖత చూపుతున్నారని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, సీఐఐ సభ్యులు, వాణిజ్య మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కాగా, సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలు తీసుకున్నాక..ఇటు సీఎం..అటు మంత్రులు అంతా క్షణం తీరిక లేకుండా పాలనలో నిమగ్నమయ్యారు. జగన్ రెడ్డి హయాంలో గాడితప్పిన పాలనను సీఎం సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈక్రమంలో ఏపీకి పెట్టుబడులు తేవడంలోనూ ఆయన ముఖ్యపాత్ర పోషించనున్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అహర్నిషలు కృషి చేస్తూ ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు.