NEET exam : నీట్ పరీక్షను రద్దు చేయడం సమంజసం కాదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్దం కాదని, ఈ చర్య నిజాయితీ కలిగిన అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. పారదర్శకంగానే పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పలువురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పేర్కొంది. నీట్ అక్రమాలపై సీబీఐతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్న కేంద్రం, భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాల్లేవని తెలిపింది. అలాంటప్పుడు మొత్తం పరీక్షను, ఇప్పటికే ఫలితాలు విడుదలైన ఫలితాలను రద్దు చేయడం సహేతుకం కాదని అఫిడవిట్ లో పేర్కొంది. నీట్ ను రద్దు చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షల మంది నష్టపోతారని తెలిపింది.
మే 5న నిర్వహించిన నీట్-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలనే డిమాండ్లు వస్తున్న విషయం తెలిసిందే. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్ ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, నీట్ పరీక్ష రద్దు చేయొద్దని కోరుతూ గురువారం 56 మంది నీట్ ర్యాంకర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.