Bird flu Death : మెక్సికోలో ఈ ఏడాది ఏప్రిల్ లో బర్డ్ ఫ్లూ రోగి మృతి చెందాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధ్రువీకరించింది. జ్వరం, అతిసారం, వికారం లక్షణాలతో బాధపడుతూ మృతి చెందాడని తెలిపింది. ఒక వ్యక్తి బర్డ్ ఫ్లూతో మరణించడం ప్రపంచంలో మొదటిసారి అని వెల్లడించింది. అయితే, ప్రస్తుతం ప్రజలకు బర్డ్ ఫ్లూ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
మెక్సికోలో ఒక వ్యక్తి (59) జ్వరం, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు, వికారం వంటి లక్షణాలతో మెక్సికో నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరగా, అతడిని పరీక్షించిన వైద్యులు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. అతడు ఏప్రిల్ 24న చికిత్స పొందుతూ మరణించాడు. చనిపోయిన వ్యక్తికి A(H5N2) వైరస్ సోకినట్టు వైద్యులు తేల్చారు. ఇది మెక్సికోలోని పౌల్ట్రీల్లో కోళ్లకు ఎక్కువగా ఉంటుందని WHO తెలిపింది.