Chandrababu : 16వ శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని, ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న అని చంద్రబాబు కొనియాడారు. 66 ఏళ్ల వయస్సు ఉన్నా ఇప్పటికీ ఫైర్ బ్రాండే అని పేర్కొన్నారు. అత్యున్నత, గౌరవప్రదమైన సభగా 16వ సభను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
66 ఏళ్ల వయసు ఉన్నా అయ్యన్న ఇప్పటికీ ఫైర్ బ్రాండే అని అన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతను పుణికిపుచ్చుకొని రాజకీయాలు చేశారన్న చంద్రబాబు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న నాయకుని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని, అనేక పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టి వేధించారన్నారు. 23 కేసులుపెట్టినా రాజీలేని పోరాటం చేశారన్నారు.
చట్టసభకు రావడం అరుదైన గౌరవమన్న చంద్రబాబు, మనందరిపై పవిత్ర బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలన్నారు. సమర్థంగా పనిచేస్తే గౌరవం దానంతట అదే వస్తుందని, ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బందిపెట్టారని, తన కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారని పేర్కొన్నారు.