Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ!
Ayodhya Ram Mandir Roof Leakage : అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరిగిన ఆరు నెలల్లోనే లీకేజీలు ఏర్పడ్డాయి. గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర తెలిపారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లీకేజీ సమస్య బయటపడిందని పేర్కొన్నారు.
ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారి శనివారం రాత్రి భారీ వర్షం పడడంతో లీకేజీ సమస్య బయటపడిందని, నీరు సరిగ్గా రామ్ లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చొనే, వీఐపీలు దర్శనం చేసుకునే ప్రాంతంలో నీరు కారుతోందని ఆయన తెలిపారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవని తెలిపారు. ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
వర్షపునీరు లీకేజీపై రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర స్పందించారు. ఆలయానికి చేరుకుని పైకప్పుని వాటర్ ప్రూఫ్ గా మార్చేలా మరమ్మతులు చేయాలని సూచించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మొదటి అంతస్తు పనులు .జులై చివరికి, మొత్తం ఆలయ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తవుతుందని మిశ్ర వెల్లడించారు.