Good News : ఎన్నికల ఫలితాలు వెలువడి ఎన్డీయే ఏపీలోను, దేశంలోను అధికారంలోకి వచ్చిన వేళ రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక శుభవార్త వెలువడింది. రైల్వేలకు, ఆధ్యాత్మిక పర్యటనలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే పీఎం మోదీ ఈ శుభవార్తను తెలిపారు. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ టూరిస్టు సర్క్యూట్ రైలును ప్రారంభించనున్నారు. ఐఆర్ సిటిసి ఆధ్వర్యంలో జరిగే ఈ యాత్ర తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు వంటి దివ్య స్థలాలను సందర్శింపజేస్తుంది.
తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ భారత్ గౌరవ్ టూరిస్టు రైలు ఆగుతుంది. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, డిన్నర్ సౌకర్యంతో పాటు ప్రయాణ బీమా సౌకర్యం కూడా ఉంది. సెకండ్ ఏసీలో ప్రయాణించాలనుకుంటే ఒక్కొక్కరికి రూ. 28,450, థర్డ్ ఏసీకైతే 21,900, స్లీపర్ లో ప్రయాణానికి రూ. 14,250 అవుతుంది. ఆయా ప్రాంతాల్లో వాహన సౌకర్యం అవసరమైతే అది కూడా ఐఆర్ సీటీసీనే భరించనుంది.