ACP Uma Maheswara Rao : సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో (సీసీఎస్) ఏసీపీగా పనిచేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్టు చేసింది. ఆదాయానికి మించా ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది.
తాజాగా ఉమామహేశ్వరరావు ఆగడాలపై ఓ బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నంలో ఏసీబీగా ఉన్న సమయంలో ఉమామహేశ్వరరావు ఎస్సీ, ఎస్టీ కేసులు నీరుగార్చారని, ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలంటే రూ.10 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. తన ల్యాండ్ కబ్జా చేసేందుకు యత్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడితే, ఆ కేసును వెనక్కి తీసుకోవాలని ఉమామహేశ్వరరావు బెదిరించారని శ్రీనివాస్ తెలిపారు. బూట్ కాళ్లతో తన్ని వేధింపులకు గురి చేశాడని వివరించారు.