AP Debts : ఏపీ అప్పులు రూ.13 లక్షల కోట్లు: బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి దినకర్
AP Debts : సీఎం జగన్ దిగిపోయే నాటికి ఏపీ అప్పులు రూ.13 లక్షల కోట్లకు చేరినట్లు బీజేపీ ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. ఆయన బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వానికి ప్రస్తుతం బడ్జెట్ రుణాలు రూ.5.50 లక్షల కోట్లు ఉన్నాయని, బడ్జెటేతర రుణాలు రూ.7.50 లక్షల కోట్లు ఉన్నాయని తెలిపారు. అందులో బడ్జెట్ రుణాలకు రోజుకు రూ.100 కోట్లు, బడ్జెటేతర రుణాలకు రోజుకు రూ.150 కోట్లు కలిపి నిత్యం రూ. 250 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అంటే సంవత్సరానికి అప్పులపై వడ్డీ కిందే రూ.90 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. జగన్ ప్రభుత్వం పారదర్శకత లేకుడా చేసిన రుణాలు, ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడిందని తెలిపారు.
2019 ఎన్నికల్లో విజయం తన గొప్పతనమే అని చెప్పుకున్న మాజీ సీఎం జగన్ తాజా పరాజయాన్ని ఈవీఎంలపైకి తోసేయాలని చూస్తున్నాడని, అది చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ ఏపీ కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు ఢిల్లీలో పేర్కొన్నారు.