Agnipath scheme : ఎన్డీయే కూటమి పక్షాల నుంచి బీజేపీకి అప్పుడే డిమాండ్లు ఎదురవుతున్నాయి. అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంను సమీక్షించాలని నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ డిమాండ్ చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ సీ్కంపై యువత, నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉందని, లోక్ సభ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించిందన్నారు. ‘‘అగ్నిపథ్ స్కీం ప్రవేశపెట్టినప్పుడు సాయుధ దళాల నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. ఎన్నికల సమయంలో వారి కుటుంబాలు కూడా నిరసన తెలిపాయి. ఆ స్కీంపై రివ్యూ చేయవలసిన అవసరం ఉంది’’ అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని ఎన్డీయే మిత్రపక్షం ఎల్ జేపీ (రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. అలాగే అగ్నిపథ్ స్కీం ద్వారా దేశంలోని యువతకు ఏం ఇస్తున్నామనే విషయంపై కూడా సమీక్షించాలని తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని ఆ తర్వాత దీనిపై చర్చిస్తామన్నారు.