Ram Mandir : అయోధ్యలో రామాలయం, రాములోరి ప్రాణప్రతిష్ఠకు దేశం యావత్తూ సిద్ధమైంది. అయోధ్యలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు ఇప్పటికే అందించారు. ఇందులో రాజకీయ, సినీ, పారిశ్రామిక, హిందూ మత పెద్దలు ఉన్నారు. కోట్లాది హిందువుల శతాబ్దాల కల నెరవేరే రోజు కోసం సర్వత్రా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రాణప్రతిష్ఠ ప్రధాన కార్యక్రమం ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు జరుగుతుంది. మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అయోధ్య గురించి ఎన్నో ఆసక్తికర అంశాలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ముహూర్తాన్ని 22న ఎందుకు ఎంపిక చేశారని అందరిలో సందేహాలు ఉన్నాయి. దీనికి పండితులు చెప్పిన సమాధానం ఇలా ఉంది..
హిందూ పురాణాల ప్రకారం.. అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగాల సంగమ సమయంలో శ్రీరాముడు జన్మించాడు. ఈ పవిత్రమైన కాలాలన్నీ 2024 జనవరి 22న సమలేఖనం అవుతాయి. ఈ కాలం ప్రాణప్రతిష్ఠకు లేదా అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకకు అనువుగా ఉంటుంది.
ఇక వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం.. అభిజిత్ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సమయం. ఇది దాదాపు 48 నిమిషాలు ఉంటుంది. 2024 జనవరి 22న అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12.16 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.59కి ముగుస్తుంది. ఈకాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినందున హిందువులకు ఇది శుభసమయం. హిందూ పురాణాల ప్రకారం, ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.
మృగశిర్ష 27 నక్షత్రాలలో ఐదోవది. ఇది ఓరియోనిస్ రాశిని సూచిస్తుంది. మృగశిర్ష అంటే జింక తల. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. తెలివైనవారు. రాముడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు. మృగశిర్ష కథ ప్రకారం.. రాక్షసులు అమరత్వం కోసం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం అయిన సోమను అపహరించి, కమలంలో దాచారు. దేవతలు సహాయం కోసం జింకల రాజు మృగశిర్షను సంప్రదించారు. అతను చివరికి సోమను విడిపించాడు. 2024 జనవరి 22న, మృగశిర్ష నక్షత్రం ఉదయం 03.52 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 జనవరి 23న ఉదయం 07.13వరకు కొనసాగుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే జనవరి 22న రాములోరి ప్రాణప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవాన్ని హిందూ పండితులు ఎంపిక చేశారు.