Ayodhya Temple : అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేళ..5 కంపెనీల స్టాక్స్ ఎందుకు పెరిగాయి..?
Ayodhya Temple : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం, రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈనెల 22 జరుగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం కోట్లాది హిందువులు వెయికండ్లతో ఎదురుచూస్తున్నారు. రామాలయ నిర్మాణంతో కేవలం ధార్మిక, సాంస్కృతిక అంశాల్లోనే కాదు ఇతర రంగాలు ప్రభావితమవుతున్నాయి. తాజాగా అయోధ్యలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. అంతేకాదు స్టాక్ మార్కెట్ కూడా సానుకూలంగా ఉంది. కొన్ని స్టాక్స్ మాత్రం పాజిటివ్ ట్రెండ్ తో దూసుకెళ్తున్నాయి. అవి ఏంటో చూద్దాం..
ఐఆర్ టీసీ:
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ స్టాక్ గత నెలలో 20 శాతానికి పైగా పెరిగింది. శ్రీరాముడి ఆలయ ప్రతిష్ఠాపన ఉత్సవం కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలిరానున్నారు. అయోధ్యను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ చర్యలు ఐఆర్ టీసీకి గణనీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. జనవరి 12న దీని షేర్ ధర రూ.950గా ఉంది.
అపోలో సింధూరి హోటల్ లిమిటెడ్:
చెన్నైకి చెందిన ఈ హాస్పిటాలిటీ కంపెనీ షేర్ ధర జనవరి 12 నాటికి రూ.2,560గా ఉంది. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ 90శాతం కంటే ఎక్కువ పెరిగింది. ఈసంస్థ అయోధ్యలోని తేధి బజార్ లో మల్టీ లెవల్ పార్కింగ్, బిగ్ రూఫ్ టాప్ రెస్టారెంట్ ను డెవలప్ చేస్తోంది. ఇది దాని మార్కెట్ విలువను మెరుగుపరుస్తోంది.
ప్రవేగ్ లిమిటెడ్:
ఈవెంట్ అండ్ ఎగ్జిబిషన్ మేనేజ్ మెంట్ లో ప్రత్యేకత కలిగిన ఈ స్మాల్-క్యాప్ కంపెనీ స్టాక్ ప్రైస్ గత నెలలో 70శాతానికి పైగా పెరిగింది. ప్రవేగ్ లిమిటెడ్ అయోధ్యలో రెండు డేరా నగరాలను ఏర్పాటు చేసింది. ఒకటి రామజన్మభూమి సమీపంలో, మరొకటి సరయూ నది ఒడ్డున ఉంది. ఒక నైట్ కు రూ. 8వేల నుంచి ప్రారంభమయ్యే విలాసవంతమైన వసతి గృహాల బుకింగ్ లు గత నవంబర్ లో స్టార్ట్ అయ్యాయి. అంతే కాకుండా ఈ కంపెనీ ఇటీవల లక్షద్వీప్ లో కూడా రిసార్ట్ ను నిర్మించింది. దీంతో ఈ కంపెనీ స్టాక్స్ బాగా పెరిగాయి. నిన్నటికి దీని షేర్ ధర రూ.1,135.90గా ఉంది.
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్:
ఇటీవల ప్రభుత్వం అయోధ్యలో ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించింది. దేశంలోని అతిపెద్ద ఎయిర్ లైన్స్ లో ఒకటైన ఇండిగో జనవరి 6న ఢిల్లీ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ముంబై, అహ్మదాబాద్ నుంచి కూడా సర్వీసులు మొదలుకానున్నాయి. దీంతో ఇండిగో పేరెంట్ కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్ ధర నెలలో 4 శాతం కంటే ఎక్కువ పెరిగింది. దీని షేర్ ధర రూ.3,066.35గా ఉంది.
జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్:
ఇది మ్యాపింగ్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ కంపెనీ. అయోధ్య నగరం అధికారిక మ్యాప్ ను చార్ట్ చేయడానికి అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ తన న్యూ ఇండియా మ్యాప్ ప్లాట్ ఫారమ్ ను ఎంపిక చేసినట్లు కంపెనీ వెల్లడించింది. తమ మ్యాపింగ్ ప్లాట్ ఫారమ్ ప్రజలకు కచ్చితమైన రూట్స్, లొకేషన్ డీటైల్స్ అందించడమే కాకుండా ఎలక్ట్రికల్ వాహనాల కోసం రూపొందించిన ప్రత్యేక ఫీచర్ ను కూడా కలిగి ఉందని తెలిపింది. గడిచిన ఒక నెలలో కంపెనీ షేర్ ధర 16శాతానికి పైగా పెరిగింది. షేర్ ధర రూ.507.80గా ఉంది.