Golden Doors of Ayodhya : జనవరి 22వ తేదీ అయోధ్యలో శ్రీమురాడి ప్రాణప్రతిష్ట జరుగుతుంది. జగదభిరాముడి పట్టాభిషేకం కోసం సమస్త లోకం ఆతృతగా ఎదురు చూస్తోంది. శ్రీరామ తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చక చకా నిర్వహిస్తున్నారు. వైభవోపేతమైన.. దివ్య, భవ్య మందిరాన్ని దర్శించుకునేందుకు వందలాది మంది అయోధ్యకు తరలుపుతున్నారు. ఇప్పటికే అత్తింటి నుంచి కానుకలు, సంభారాలు వచ్చాయి. అన్ని ఏర్పాట్లు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ట్రస్ట్ చర్యలు తీసుకుంటుంది.
ఆలయ నిర్మాణ పనులు అన్నీ పూర్తికాగా.. నిర్మాణంలోని విషయాలు.. విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవి కాస్తా సోషల్, మేయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దేశ ప్రముఖులు ఈ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ 22న ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి శ్రీరామ తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆలయంలో ఏర్పాటు చేసిన బంగారు తలుపునకు సంబంధించి ఒక ఫొటో బయటకు వచ్చింది. తలుపుపై ముచ్చటగొలిపే కళాఖండాలను పొదిగారు. మీడియాకు అందిన సమాచారం మేరకు ఈ తలుపు 12 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పుతో ఉంది. అయితే ఈ తలుపును మొదటి అంతస్తులో అమర్చారు.
ఆలయంలో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేశారట. అందులో 42 తలుపులకు 100 కిలోల బంగారు పూత చేయనున్నారట. గుడిమెట్ల వద్ద ఉండే 4 తలుపులకు ఎటువంటి బంగారు పూత ఉండదు. అందుతున్న నివేదికల ప్రకారం.. రాబోయే రోజుల్లో మరో 13 బంగారు తలుపులను అమరుస్తారట. ఆలయం తలుపునకు సంబంధించిన ఫొటోలో రెండు ఏనుగులు స్వాగతం పలుకుతున్నట్లు చెక్కారు.
ద్వారం పైభాగంలో రాజభవనం లాంటి ఆకృతి కలిగి ఉంది. ఇక్కడ సేవకులు ముకుళిత హస్తాలతో కనిపిస్తారు. దిగువన చదరపు ఆకారంలో అందమైన కళాకృతులు ఉంటాయి. ఈ తలుపులను హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ నిర్మిస్తుందట.
ఈ కంపెనీ మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల నుంచి కలపను తెప్పించింది. తలుపులను కన్యాకుమారి కళాకారులు తయారు చేస్తున్నారు. ఆలయానికి సంబంధించి బయటకు వస్తున్న ఫొటోలను బట్టి చూస్తే ఎంతో వైభవంగా ఉండనుందని తెలుస్తోంది.