PM Modi : రామమందిర ప్రారంభోత్సవం వేళ మోదీ ఎమోషనల్..11 రోజుల దీక్ష
PM Modi : మరో 10 రోజుల్లో కోట్లాది హిందువులు ఎంతో భక్తపారవశ్యంతో ఎదురుచూస్తున్న రామమందిర ప్రారంభోత్సవం, రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుక జరుగబోతోంది. ఈ వేడుకలను ప్రత్యక్షంగానూ, టీవీల ద్వారా తిలకించి తరించాలని భావిస్తున్నారు. ఈ ప్రాణప్రతిష్ఠ దగ్గర పడుతున్న వేళ.. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశం అందించారు. ఈ రోజు నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని వెల్లడించారు. ఈమేరకు ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు. దానిని తన అధికారిక యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేశారు. ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించే అవకాశం కలుగడం తన అదృష్టమని ఆయన అందులో వెల్లడించారు.
‘‘అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఇంకా 11 రోజులే మిగిలి ఉంది. ఈ ప్రారంభోత్సవానికి దేశ ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండడం నా అదృష్టం. దీనిని దృష్టిలో పెట్టుకుని నేటి నుంచి 11 రోజుల ప్రత్యేక ఆరాధన మొదలు పెడుతున్నాను. ప్రస్తుతం నేను ఎంతో ఉద్వేగ్నంతో ఉన్నాను. నా మనసులో తొలిసారి ఇలాంటి భావాలు మెదులుతున్నాయి. దేవుడి ఆశీస్సుల వల్లే కొన్ని వాస్తవ రూపం దాల్చుతాయి. ఈ ప్రారంభోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భం’’ అంటూ సందేశం అందించారు.
కాగా, రామాలయ ప్రారంభోత్సవం, రామయ్య ప్రాణప్రతిష్ఠకు ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్ల చేసింది. ఇప్పటికే అన్ని పనులు దాదాపు చివరి దశకు వచ్చాయి. అయోధ్యలో ప్రతీ రోజూ పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా నిర్వహిస్తున్నారు. అయోధ్యతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రామాయణంతో సంబంధమున్న ప్రతీ ప్రాంతాన్ని ముస్తాబు చేశారు. అయోధ్యలోని సరయు నదీ తీరంలో రామాయణ ఆధ్యాత్మిక వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ ప్రదర్శన శాలగా ఉండే ఈ వనం రామాయణంలోని అరణ్యకాండ ఘట్టాలు అలరించనున్నాయి. అయోధ్య బృహత్తర నిర్మాణ ప్రణాళికలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు.