Ayodhya Rama : అయోధ్యలో ఆసీనుడైన రాముడి ఫొటో చూశారా?
Ayodhya Rama : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులే మిగిలి ఉంది. 22న మధ్యాహ్నం మహోజ్వల సంరంభం కొనసాగనుంది. రాముడి జన్మస్థలంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా వేలాది మంది ప్రముఖులు రానున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ నటులు, రాజకీయ నేతలకు ఆహ్వానాలు పంపారు. వారంతా విగ్రహ ప్రతిష్టాపనకు హాజరు కానున్నారు.
వేదమంత్రాల మధ్య అయోధ్య మారుమోగుతోంది. 15వ తేదీ నుంచే ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆచారాలు, కార్యక్రమాలు చేపడుతున్నారు. రాముడి విగ్రహ ఫొటోలు వెలువడ్డాయి. గర్భగుడిలో ప్రతిష్టించిన అనంతరం బయటకొచ్చినట్లు మొదటి ఫొటోలు కావడంతో వస్త్రాలతో కప్పి ఉంచారు. ప్రాణప్రతిష్ట రోజు వాటిని తొలగిస్తారు.
కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగి రాజ్ తీర్చిదిద్దిన విగ్రహం ఎత్తు 51 అంగుళాలు ఉంటుంది. 150 నుంచి 170 కిలోల బరువు ఉంటుంది. 70 ఏళ్లుగా రామజన్మ భూమిలో పూజలందుకుంటున్న రామ్ లల్లా విగ్రహం గర్భాలయంలోనే ఉంచారు. గురువారం అయోధ్య రాముడు గర్భగుడిలోకి వచ్చిన విషయం తెలిసిందే.
విగ్రహానికి ప్రాణప్రతిష్ట మహోత్సవానికి విఘ్నాలు రాకుండా ఏర్పాట్లు చేశారు. దేశ క్షేమం కోసం యజ్ణయాగాలు చేయనున్నారు. లోకా సమస్తం సుఖినోభవంతు అంటూ వేద మంత్రోచ్ఛారణల మధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కొనసాగనుంది. దీనికి దేశంలోని అతిరథ మహారథులు విచ్చేయనున్నారు. వేద పారాయణం చేస్తూ రాముడి విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు.